అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. కోరిన కోర్కెలీడేర్చే దేవుడు.. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు.... భక్తుల పాలిట కొంగు బంగారం.. కలియుగ ప్రత్యక్ష దైవం.. ఆ తిరుమలేశుడు. పిలిచినంతనే పలికే దేవుడు.. భక్త జనులకు కొండంత అండ ఆయనే.. అందుకే శతాబ్దాలుగా తిరుమల అతి పెద్ద హిందూ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. సకల జనులను నిత్యం కాపాడే గోవిందుడు.. ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడు. ఆ కమలనాభుని ఒక్కసారి దర్శించుకుంటే చాలు సకల పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. అందుకోసం దేశవిదేశాల నుంచి భక్తకోటి తిరుమలకు తరలి వస్తుంది. ఒక్కసారి దర్శించుకున్నా తనవి తీరక, మరలి మరలి వస్తుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు, ఏడేడు లోకాలను కాచే ఆ దేవదేవుని దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా చూసేందుకు ఏడు కొండలూ ఎక్కి తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు.

తిరుమల.. ప్రపంచలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం. ఏడు కొండల మీద కొలువైన శ్రీనివాసుడిని కళ్లారా దర్శించేందుకు వేల మైళ్లు దాటి భక్తులు తరలి వస్తారు. కోరిన కొర్కెలీడేరె కలియుగ మహా దైవ దర్శనానికి కాలి నడకన కొండ కొండా ఎక్కి కోనేటి రాయుడిని చేరుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చినా.. ఎంత ప్రయాస పడినా.. ఒక్క క్షణం ఆ తిరుమలేశుని దర్శనం అయితే చాలు... సకలం...సర్వం మరచి.. భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. వెండికొండపై కొలువు దీరిన కమలనాభుని దర్శనానికి... గంటల తరబడి వేచిఉన్నా... ఆ స్వామి గర్భ గుడిలో అడుగు పెట్టగానే...ఆ కష్టమంతా మైమరచిపోతారు. నిలువెల్లా కనులు చేసుకుని స్వామి కోసం ఎదురుచూస్తారు. సర్వంగా సుందరంగా అలంకరించుకున్న ఆ వెంకటేశ్వరుని దర్శనం కాగానే... సకల భక్త కోటి అణువణువూ పులకించిపోతుంది.

నిత్యం సుగంధ పరిమళాల పుష్పాలతో అలరారే ఆ భక్తవత్సలుడికి నైవేద్యాల కన్నా.. వజ్రవైఢూర్యాల కన్నా భక్తులు తనపై కురిపించే భక్తిరసమంటేనే అమిత ఇష్టం. ఇటు భక్తులు కూడా ఏళ్లకేళ్లుగా భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటూనే ఉన్నారు. కష్టమొచ్చినా, ఆనందమొచ్చినా... బాధొచ్చినా .. సంతోషమొచ్చినా ... అంతా తలచేది తిరుమలేశుడినే. తమ కష్టాలు తీర్చమని ముడుపులు కడతారు. తమ కష్టాలు గట్టెక్కితే, అదిస్తామని, ఇదిస్తామని ఆ ఆపదమొక్కుల వాడిని మొక్కుకుంటారు. తలనీలాల దగ్గర నుంచి నిలువు దోపిడీ వరకూ అన్నీ స్వామివారికే అర్పించేస్తారు. ఇలా స్వామి వారికి ముడుపు కట్టి మొక్కులు తీర్చడమంటే భక్తులకెంతో ప్రీతిపాత్రమైపోయింది. అలా శ్రీవారి హుండీ రోజుకు లెక్కలేనన్ని సార్లు నిండుతూనే ఉంటుంది. భక్తులు సమర్పించే కానుకల కొండ.. ఏడు కొండలను మించిపోతూనే ఉంది. ఆ లక్ష్మీపతి భక్తజన ప్రియుడు, నైవేద్య ప్రియుడే కాదు.. అంతకు మించి అలంకార ప్రియుడు కూడా. అందుకే శతాబ్దాలుగా ఆ స్వామికి దాసోహం అన్న రాజుల దగ్గర్నుంచి తాజా రాజకీయ నాయకుల వరకూ అంతా ఆయనకు విశేష బంగారు ఆభరణాలతో కొలుస్తూనే ఉన్నారు.

ఆ వెంకటేశ్వరుని దివ్య మంగళ స్వరూపాన్ని ఒక్కసారి దర్శంచుకోగానే, ఎంతటి వారికైనా మరోసారి దర్శనానికి రావాలన్న తలంపు క్షణాల్లో కలుగుతుంది. అంతటి వైశిష్ట్యం ఉన్న పవిత్రాలయం తిరుమల. ఆ తిరుమలేశుని ఆలయం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా అనుదినం కళకళలాడుతూనే ఉంటుంది. ఇక స్వయానా బ్రహ్మదేవుడు స్వామి వారిని నిర్వహించే దివ్య వైభోగాన్ని భక్తులకు కటాక్షించే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో అణువణవూ భక్తి పారవశ్యంతో పులకించి పోతుంది.

అందునా పర్వదినాల్లో స్వామి వారిని దర్శించుకుంటే ఐహిక బంధాలను వీడిన పిమ్మట.. కైవల్య ప్రాప్తి పొందుతామన్నది భక్తుల అపార విశ్వాసం. అందుకే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల ఇసకేస్తే రాలనంత భక్త జనంతో నిండిపోతుంది. ఇక వైకుంఠ ఏకాదశి నాడు.. ఉత్తర ద్వారం గుండా ఆనంద నిలయంలో అడుగిడి స్వామి దర్శనం చేసుకుంటే ముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఇలా ఏడాదిలో వచ్చే ఎన్నో పర్వదినాల్లో ఆ స్వామి దర్శనం కోసం భక్త జన కోటి ఏడు ఖండాల నుంచి ఆ ఏడు కొండలకు పరుగులు తీస్తుంది. కాలి నడకన వచ్చి ఆ స్వామి దర్శనం చేసుకుని ఎనలేని ముక్తిని పొందాలని ప్రయత్నిస్తుంది.

బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం
మాసానాం మార్గశీర్షో హ మృతూనాం కుసుమాకరః

సామములలో బృహత్సామం, ఛందస్సులలో గాయత్రి, నెలలలో మార్గశిరము, ఋతువులలో వసంతమూ నేను అని ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునిడికి భగవద్గీత సారంలో చెప్తాడు. ఆ శ్రీకృష్ణుని పూర్వావతారమైన మహావిష్ణువుకి కూడా మార్గశిర మాసమంటే మహా ప్రీతికరం. ఆ లక్ష్మీ దేవి కూడా మార్గశిర మాసంలో తనను కొలిచిన వారిని కొంగు బంగారంలా నిలుస్తుంది.

కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో... తరచూ తిరుమల వెళ్లేంత సమయం ఎవరికీ చిక్కడం లేదు. అలాంటిది పుణ్యదినాల్లో వెళ్లడం అంటే ఆ రద్దీలో, నేటి గజిబిజి ఉద్యోగ జీవితాల్లో కుదిరేపని కాదు. పోనీ చుట్టుపక్కల ఉన్న వెంకటేశ్వర ఆలయానికి వెళ్తామా అంటే... చాలా దేవాలయాలు.. వాస్తు శాస్త్ర రీత్యా నిర్మించబడినవే తప్ప... ఆ శ్రీనివాసునికై ఉద్దేశించిన ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం పూర్తి చేసుకుని ఉండవు. ఒకవేళ అలా ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మించి ఆలయాల్లో కూడా... ఆ శాస్త్ర ప్రకారమే పూజాది నైవేద్య కార్యక్రమాలు నిర్వించే పురోహితులు ఉండరు. అందుకే అందరూ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తిరుమలకు పరుగులు తీస్తారు.

తిరుమల ఇప్పుడు మీ చెంతనే..

వేంకటేశ్వరుడు సామాన్యమైన దేవుడు కాదు. వేం అంటే పాపాలు, కట అంటే తొలగించే, ఈశ్వరుడు అంటే దేవుడు. భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వేంకటేశ్వర నామము ప్రసిద్ధి చెందింది. మానవ జీవితంలో కలిగే ఆపదలను తొలగించే దేవునిగా , ఆపద మొక్కుల వాడిగా జగత్ప్రసిద్ధి చెందిన ఆ దేవదేవుడు.. ఇప్పుడు మీ చెంతకు రాబోతున్నాడు. సర్వంతర్యామి అయిన ఆ మహా విష్ణువు దివ్య మంగళ స్వరూపాన్ని అచ్చుగుద్దినట్లు ప్రతిష్టించడమే కాదు. పరమ పూజ్యనీయమైమ ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం శ్రీ వేంకటేశ్వ దివ్యాలయ సముదాయాన్ని నిర్మించారు. ఇది మరెక్కడో కాదు.... తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో నిజాం పేట ఎక్స్ రోడ్ సమీపంలో, సర్దార్ పటేల్ నగర్ నందు సర్వాంగ సుందరంగా, సర్వదేవతా మూర్తులు కొలువై ఉండే విధంగా , సమస్త పాపములను తొలగించే విధంగా, నభూతో నభవిష్యత్ అన్న చందంగా నిర్మించిన ఆలయ సముదాయమే.. శ్రీ వేంకటాద్రి దేవస్థాన సముదాయం.

దేవస్థాన సముదాయ ప్రతిష్టా మహోత్సవం

శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిచే అద్భుత అవకాశం. జీవితంలో నూటికో కోటికో ఒక్కరికి మాత్రమే దక్కుతుంది. సర్దార్ పటేల్ నగర్ కాలనీలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థాన సముదాయంలో శ్రీ లక్ష్మీ గోదా దేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి జీవధ్వజ, విమాన శిఖర, జయ, విజయ, గరుడ, ఆంజనేయ, గణాధిప, బలిపీఠ ప్రతిష్టా మహోత్సవాన్ని 2015 మే 28వ తేదీ ఉదయం 8 గంటల 24 నిముషాలకు అంగరంగ వైభవంగా గుర్గువులు నిర్వహించారు. కావున అన్ని కాలనీల భక్తులు యావన్మందీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని ఆ కోనేటి రాయుని కృపకు పాత్రులు కావచ్చును. స్వస్తిశ్రీ చాంద్ర మాన శ్రీ మన్మథనామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ రుతు జ్యేష్ఠ మాస శుద్ధ సప్తమి ఆదివారం, 2015 మే 24 నాడు ప్రారంభమై పంచాహ్నిక దీక్షలతో శుద్ధ దశమి గురు వారం మే 28 ఉత్తరా నక్షత్ర యుక్త మిథున లగ్నం వరకూ ఈ ప్రతిష్టా మహోత్సవ ఘట్టాలు కొనసాగాగయి. జీవితంలో ఒక్కసారి లభించే ఈ అద్భుత కార్యక్రమంలో కాలనీ వాసులతో పాటు, చుట్టు పక్కల ప్రాంతాల భక్తకోటి కూడా పాల్గొని తమ జన్మలను చరితార్థం చేసుకుంది.