దేవాల‌యాలు ఎందుకంటే..?

దేవానాం దేవస్య వా ఆలయా అని వక్కానించారు మన మహర్షులు. మానవునిలో దైవ చింతన పెంచి, సన్మార్గంలో నడిపించి, ముక్తి మార్గం ఒసగేలా మార్గదర్శనం చేసేందుకు దేవతావిగ్రహాలను, ఇతర ఆరాధ్య వస్తువులను ప్రతిష్టించి, వాటి రక్షణకోసం నిర్మించిన పవిత్ర ప్రదేశమే దేవాలయం. అందుకే పూర్వికులు కూడా దేవాలయాల్ని సప్త సంతానాలలో ఒకటిగా పేర్కొన్నారు. కుమారుడు లేదా కుమార్తె, తటాకం, కావ్యం, విధానం, ఆలయం, వనం, భూదేవస్థాపనం అనే సప్తసంతానాల్లో ఆలయాన్ని కూడా చేర్చారు. అంటే దాని ప్రకారం.. ప్రతి మానవుడు తన శక్తి వంచన లేకుండా ఆయల సేవలో నిమగ్నం కావాలి. కొందరు ఆలయాల్ని నిర్మిస్తారు. అందరికీ ఆ అవకాశం ఉండదు కాబట్టి తమ శక్తి కొలది విరాళాలిస్తారు. మరికొందరు కానుకలిస్తారు. ఇంకొందరు ఆలయ సందర్శన సమయంలో దక్షిణ సమర్పించుకుంటారు.

మన సంస్కృతి, కళలు, శిల్పం, వాస్తు, వేదాంతం పురాణం మొదలైన వాటి సంగమ స్థానం హిందు దేవాలయం. పరిపూర్ణమైన, సుందరమైన ఆలయం అంటే మానవశరీరమే. ఇక్కడ ఆత్మ నే ఇల్లుగా చేసుకుని, మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, పంచవిషయాలు అంతరంగ వృత్తులు (అంత: కరణ, మనస్సు, చిత్త, బుద్ధి, అహంకారాలు) తమ క్రియలను నిర్వహించడానికి అవకాశాన్ని కల్పించే ఒకే ఒక ప్రదేశం దేవాలయం. దేవాలయాలు శాంతికి నిలయాలు. ప్రశాంతతకు ఆలయాలు. దేవాలయ అనేది ప్రతీది ధర్మబోధ చేసి, మానవ మహోన్నతికి బీజాలు వేస్తాయి. వ్యక్తుల్ని హరిష్వడ్వర్గాల నుంచి విమముక్తులను చేస్తాయి. ఒక్క ఆలయం విలయాన్ని కూడా ఆపగలుతుంది. అందుకే పూర్వికులు ప్రతి ఊళ్లోనూ ఆలయాలు కట్టించమని చెప్పేవారు. ప్రత ఇంటా పూజా మందిరాన్ని ఏర్పాటు చేయమనేవారు.

దేవాలయ ప్రాంగణంలో ప్రశాంతతను ఇచ్చే వాతావరణం ఉంటుంది. భగవంతునిసేవలో కొంత సేదదీరుతాము. తాము చేస్తున్న పనులు సరియైనవా, కావా అని ఆత్మవిమర్శ చేసుకునే వీలవుతుంది. భగవదారాధన చేస్తూ అసత్య దోషాలను అసంబద్ధ కార్యకలాపాలను నిర్వహించడానికి మనసులో జంకు కలుగుతుంది. ఫలితంగా లోకంలో పాపభీతి పెరిగి జనులంతా సన్మార్గంలోనే నడిచేందుకు వీలు కలుగుతుంది. తమ మొరలను ఆలకించేందుకు భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం కలుగుతుంది. తమను ఎల్లవేలలా కాపాడేందుకు ఆ దేవ దేవుడే మన సమీపాన కొలువు దీరి ఉన్నాడన్న ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఆ నీర్భీతి మానవుని ఎన్నో సత్కర్మలను ఆచించేలా చేస్తుంది. ఫలితంగా మానవ ప్రవర్తనే సవ్యంగా ఉంటుంది. దోషాలు, దుష్కర్మలు తగ్గి, ప్రతి ఒక్కరిలోనూ ఉదాత్త వ్యక్తిత్వం చేకూరి ప్రపంచంలో శాంతి వెల్లి విరుస్తుంది.