
ఈ దేవాలయం ఎక్కడంటే..?
ఈ ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా సత్కర్మలను ఆచరిస్తున్నారంటే అది పూర్వ జన్మ సుకృతమే తప్ప మరొకటి కాదు. నేటి ఆధునిక యుగంలో రోజులో భగవంతున్ని తలుచుకోవడమే గగనమైపోతోంది. అలాంటిది చుట్టుపక్కల ఓ ఆలయం ఉన్నా వెళ్లేందుకు ఎవరికీ తీరిక ఉండటం లేదు. ప్రతి యుగానికి ఒక్కో అవతారం మానవులను కాపాడుతుంది. అలా కలియుగానికి ప్రత్యక్ష దైవంగా నిలిచిన దైవ స్వరూపం శ్రీ వేంకటేశ్వర స్వామి. ఆ స్వామిని కొలిచే అదృష్టం రావడం అరుదైన అవకాశం. అలా నగర జీవితంలో వేళ్లూనుకున్న సర్థార్ పటేల్ నగర్ వాసులు ఎప్పటి నుంచో ఆ స్వామిని వారిని కొలుస్తూ వచ్చారు. 2000 సంవత్సరంలోనే ఇక్కడ బండరాళ్లతో నిండి ఉన్న ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో చదును చేసి శ్రీ వేంకటేశ్వర స్వామికి ఆలయం కట్టించారు. అప్పటి నుంచి సర్దార్ పటేల్ నగర్ వాసులకు, శ్రీనివాసునికి విడదీయ రాని అనుబంధం ఏర్పడింది. ఇక్కడి ప్రజలకు స్వామి వారు ఆరాధ్య దైవంగా మారిపోయారు. కాలనీ వాసుల విరాళాలతో, స్వామి వారికి నిత్య కైంకర్యం నిర్విఘ్నంగా సాగేది. 2013లో ఆ చిన్న ఆలయాన్ని పూర్తి స్థాయి దేవస్థానంగా నిర్మించాలన్న తలంపు కమిటీ సభ్యులకు వచ్చింది. అంతటి దివ్యమైన ఆలోచన వచ్చిందే తడవుగా నిధులు సేకరించారు. నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఆలయాన్ని ఏడాదిన్నర కాలంలో సర్వాంగ సుందరంగా, ప్రాచీన శిల్ప కళా చాతుర్యాన్ని, అత్యాధునిక నిర్మాణ నైపుణ్యాన్ని మేళవించి శ్రీ వేంకటాద్రి దేవస్థాన సముదాయాన్ని తీర్చి దిద్దారు.
సంపూర్ణంగా ఆగమ శాస్త్ర నియమాల ప్రకారమే ఆలయాన్ని తీర్చి దిద్దారు. తూర్పు అభిముఖంగా, గర్భాలయాన్ని నిర్మించారు. శ్రీవారిని వైకుంఠ ఏకాదశి నాడు సందర్శించుకుని భక్తులకు ముక్తి ఒసగేలా ఉత్తర వైకుంఠ ద్వారాన్ని నిర్మించారు. ఆలయానికి అన్ని ప్రాంతాల నుంచి చేరుకునేలా రెండు వైపుల నుంచి ద్వారాలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే.. అనంత ప్రశాంత ఆవహించేలా పరిసరాలను తీర్చి దిద్దారు. ఆలయంలోకి అడుగు పెట్టగానే ఎదురుగా విజయ గణపతి సన్నిధిని నిర్మించారు. ప్రమద గణాదులు కూడా ముందుగా కొలిచే ఏకదంతుని దర్శనం భక్తులకు ఎనలేని బలాన్నిస్తుంది. ఇక ప్రధాన దేవాలయంలో ఆనంద నిలయం. ఆ పక్కనే శ్రీ గరుడాళ్వార్ సన్నిధి, శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి సన్నిధిని నిర్మించారు. ఇక స్వామి వారికి ఉత్సవాలు నిర్వహించేందుకు వీలుగా స్వామి వారి కళ్యాణ మండపాన్ని, యజ్ఞశాలలను ఏర్పాటు చేశారు.
శ్రీవారి సన్నిధిలోకి అడుగు పెట్టడానే, తాము నిజంగా తిరుమలలో ఉన్నామా అన్నట్లు ఓ అవ్యక్తానుభూతికి లోనయ్యేలా ఆలయ ప్రాంగణాన్ని అత్యద్భుతంగా, అత్యాధునికంగా నిర్మించారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారమే ఆలయాన్ని తీర్చి దిద్దారు. కేవలం ఆలయాన్ని అలా నిర్మించడం వరకే కాదు.. నిత్యం స్వామి వారికి జరిగే పూజాధికాలు కూడా ఆగమ శాస్త్ర ప్రకారమే నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాలలో అర్చకత్వం నేర్చిన పండితులనే ఈ ఆలయంలో కూడా ప్రధాన పండితులుగా నియమించారు. నిత్యం వారి ఆధ్వర్యంలోనే ఇక్కడి ఆలయంలో కొలువైన దేవతా మూర్తులకు వేదోదికంగా, శాస్త్రయుక్తంగా పూజాధికాలు నిర్వహించడం జరుగుతుంది.
ఆలయంలో సకల సౌకర్యాలూ ఏర్పాటు చేశారు. విద్యుద్దీపాలు, భద్రతా కెమెరాలు, భక్తులకు ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులు దేవస్థానంలో అడుగు పెట్టిన తర్వాత కేవలం దైవ చింతన తప్ప మరో ఆలోచన చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అన్నింటినీ మించి... ఆలయ మూలం, బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల సమయంలో దేవతలకు ఆహ్వానాలు పంపే ధ్వజ స్తంభాన్ని కూడా శాస్త్ర నియమానుసారమే ఏర్పాటు చేశారు.
మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఏ కార్యమైనా సంపూర్ణ శ్రద్ధతో చేయడం సాధ్యమవుతుంది. ఈ దేవస్థానంలో విధులు నిర్వహించే అర్చకులందరికీ అలాంటి సంపూర్ణ ప్రశాంతత కల్పించేలా, సర్ధార్ పటేల్ నగర్లోనే నిర్మించిన భవన సముదాయంలో ఉచిత వసతి కల్పిస్తున్నారు.
మరో వీసా బాలాజీ..!
దేవాలయం అన్నది పూర్వికులు మనకు ఇచ్చిన అపురూప వారసత్వ సంపద. అదే సంపదనను మనం మన తర్వాతి తరాలకు అందించాలి. ఓ తిరుమల, ఓ అనంతపద్మనాభ స్వామి దేవాలయం.. ఇవన్నీ శతాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే కారణం వాటి నిర్మాణ కౌశలాలే కాదు. వాటికున్న ఆధ్యాత్మికత, వాటిని నిర్వహించే భక్తుల శ్రద్ధ కూడా కారణమే. శ్రద్ధాసక్తులు లేనిదే ఏ పనీ సాధ్యం కాదు. సనాతన ధర్మం మనకు చెప్పేది ఒక్కటే.. దైవత్వాన్ని ప్రతి మనిషిలో, ప్రతి మనసులో చూడాలి అని. మానవ జీవన ప్రయాణంలో దైవ చింతన అత్యవసరమైనది. ఎందుకంటే ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు దైవానుగ్రహం తప్పనిసరి. అదే విధంగా మానవ ప్రయత్నానికి దైవ బలం కూడా తోడైతే విజయం తప్పక వరిస్తుంది. ఇలా మన సకల కార్యాల్లో విజయాన్ని సిద్ధింప చేసే దేవుళ్లు కోకొల్లలు. కోరిన కోర్కెలు తీర్చడంలో తిరుమలేశుని మించిన దైవం లేదన్నది భక్త కోటి గట్టినమ్మకం. అందుకే వడ్డీ కాసుల వాడిని మొక్కుకోగానే ఏదో ఒకటి ముడుపు కట్టేస్తారు. మరికొందరు తమ కోరికలు తీరినితే.. తలనీలాలు సమర్పించుకుంటారు. ఇంకొందరు నిలువు దోపిడీ ఇస్తారు. ఇదంతా ఆ కమలనాభుని మీద ఉన్న నమ్మకంతో మాత్రమే. ఇక తిరుమల కాకుండా అన్య ప్రాంతాల్లో చాలా చోట్ల శ్రీవారికి ఆలయాలున్నాయి. కానీ వాటిలో కొన్నింటికే అశేష విశేష ప్రాచుర్యం వస్తుంది. దానికి కారణం ఆ దేవాలయం ఉన్న స్థల మహాత్మ్యంలోనే కాదు.. అక్కడి ఆలయ నిర్వహణా విధానంలోనూ ఉంటుంది. పవిత్రమైన మనసుతో దేవున్ని స్మరిస్తేనే మనకు పుణ్యం లభిస్తుంది. అదే విధంగా త్రికరణ శుద్ధిగా దైవాలయంలో పూజాధికాలు నిర్వహిస్తేనే ఆ దేవాలయం మహిమాన్వితం అవుతుంది.
ఉదాహరణకు చిలూకురులో ఉన్న వెంకటేశ్వర స్వామిని అంతా వీసా బాలాజీ అంటారు. కారణం.. ఆ దేవాలయంలో వీసా కావాలని మనాసార కోరుకుని మొక్కుకుంటే తప్పక వీసా వస్తుందని చాలా మంది నమ్మకం. అయితే వీసాలు వచ్చే కాలంలో చిలుకూరు బాగా ప్రాచుర్యంలోకి రావడంతో అందరికీ ఆ దేవాలయంపై నమ్మకం పెరిగిపోయింది. కానీ అంతే శక్తిమంతమైన మరో వేంకటేశ్వర ఆలయం ఇదే భాగ్యనగరంలో ఉంది. కానీ ప్రాచుర్యం లేక దాని గురించి ఎవరికీ తెలియదు. ఆ ఆలయం మరెక్కడో లేదు...సర్ధార్ పటేల్ నగర్లో ఉన్న శ్రీ వేంకటేశ్వర దేవస్థాన సముదాయమే.2000వ సంవత్సరంలో ఇక్కడి కాలనీ వాసులు ఏర్పాటు చేసిన వేంకటేశ్వర స్వామి ఆలయం తొలినాళ్లలో కాలనీ వాసులకు ఓ ఆధ్యాత్మిక ప్రదేశంగా మాత్రమే ఉండేది. కానీ ఇక్కడ నివాసం ఉండే ప్రజలు క్రమం తప్పకుండా స్వామి వారిని దర్శించుకుని, త్రికరణ శుద్ధిగా స్వామిని సేవించి తమ కోరికలు కోరుకునేవారు. అలా కోరుకున్నంతనే చాలా మందికి తమ కోరికలు తీరడం ప్రారంభమైంది. ముఖ్యంగా ఎక్కువ మంది విద్యాధికులు... తమకు వీసా రావాలని కోరుకోగా.. అందరినీ వీసాలు వచ్చాయి. ఇలా సర్థార్ పటేల్ నగర్ లో ఒక్కొక్కరూ వీసా కోసం కోరుకోవడం, నెల రోజులు తిరక్కుండానే వారికి వీసాలు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి దీంతో ఇక్కడి శ్రీవారి ఆలయం మీద భక్తితో పాటు నమ్మకం కూడా పెరుగుతూ వచ్చింది. ఇలా చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు వీసాలు ప్రసాదించారు స్వామివారు. ఆ నమ్మకమే ఈ ఆలయానికి ఎనలేని కీర్తిని ఆర్జించింది. ప్రతి ఒక్క భక్తుడిలోనూ అనంతమైన, అద్వితీయమైన నమ్మకాన్ని పాదుకొల్పింది. దీనికి తోడు కమిటీ సభ్యులు కూడా ఆలయ నిర్వహణలో సంపూర్ణ శ్రద్ధాశక్తులు ప్రదర్శించేవారు. ఇది ఆలయ పవిత్రతను, శక్తిని మరింత ద్విగుణీకృతం చేయసాగింది
భక్తుల ఆదరణలతో పాటు.. ఆలయానికి భక్తుల తాకిడి కూడా పెరగసాగింది. అనునిత్యం స్వామి వారి సేవలో తరిస్తున్న సర్దార్ పటేల్ నగర్ కమిటీ సభ్యులు ఆలయ విస్తరణ ప్రణాళికలు మొదలు పెట్టారు. అనుకున్నదే తడవుగా... 2013 నవంబర్ తొమ్మిదిన... శ్రీ వేంకటేశ్వర దేవస్థాన సముదాయాన్ని అధికారిక రిజిస్టర్ బాడీగా రిజిస్టర్ చేయించారు. ఆలయాన్ని యుద్ధ ప్రాతిపదిన విస్తరించి.. భక్తులకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంలో స్వచ్ఛందంగా చందాలు వేసుకుని చిన్నదిగా ఉన్న ఆలయాన్ని సువిశాలంగా, భక్తులెందరు వచ్చినా కించిత్ కూడా ఇబ్బంది లేకుండా, అందరికీ సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దాలనుకున్నారు. అదే సమయంలో ఆలయ పవిత్రత రవ్వంత కూడా చెక్కుచెదరకుండా, ఆలయ శక్తి ద్విగుణీకృతం అయ్యేలా ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఆలయ విస్తరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఒక సత్కార్యం ప్రారంభించడానికి సమయం పడుతుందేమో కానీ.. అది పూర్తి చేయడానికి ఎక్కువ వ్యవధి పట్టదన్నట్లు.. 2013 నవంబర్లో మొదలైన ఆలయ విస్తరణ పనులు.. అందరికీ ఆశ్చర్యం కలిగించేలా కేవలం 18 నెలల్లో పూర్తయ్యాయి. ఆగమ శాస్త్ర నియమానుసారం... తిరుమలలో ఆనంద నిలయంలో కనిపించే అన్ని దృగ్విషయాలూ ఇక్కడా మనకు గోచరిస్తాయి.
ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే అనంతమైన ఆధ్యాత్మికానుభవం ఒక్కసారిగా మనల్ని ఆవహిస్తుంది. ప్రకృతిలో ఉన్న ప్రాణ శక్తి సమస్తం మనకు అనుభవైక్యమవుతుంది. మనం అడుగు పెట్టింది సర్థార్ పటేల్ నగర్ ఆలయంలోనా.. లేక సాక్షాత్ ఏడు కొండల వాడి తిరుమల ఆనంద నిలయంలోనా అన్నట్లుగా ఇక్కడ అనంత ప్రశాంతత మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. అడుగు పెట్టగానే ఎదురుగా ఈశాన్యంగా వరసిద్ది గణపతి దర్శనం మనకున్న సకల విఘ్నాటను ఒక్క తాటిన తొలగించేస్తుంది. అటు పిమ్మట ఆలయంలో ఉన్న ఒక్కో ప్రాంగణం మనలోని భక్తి భావాన్ని రెట్టింపు చేసుకుంటూ ముందుకెళ్తుంది. అలా ఒక్కొ అడుగూ మనల్ని భక్తి లోకంలోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఆలయ నిర్మాణంలో పాటించిన జాగ్రత్తలు కానీ, ఆగమ శాస్త్ర నియమానుసారం జరిగిన నిర్మాణాలు కానీ, అక్కడి దైవిక శక్తుల కానీ ప్రతి ఒక్కరినీ ప్రాపంచిక సుఖాల నుంచి బంధ విముక్తుల్ని చేసి... ముక్తి మార్గం వైపు పయనింప చేస్తాయి. అందుకే ఈ ఆలయ ప్రాంగణంలోకి వచ్చి దైవిక శక్తిని తాద్యాత్మీకరణం చెందిన ఏ భక్తుడైనా... పునర్ధర్శనం కోసం అలవోకగా మొక్కేసుకుంటారు. అందుకే సర్థార్ పటేల్ నగరలో నివాసం ఉన్న ప్రతి ఒక్కరికీ శ్రీవారు ఇష్టదైవంగా మారిపోయారు. ఇక వీసా వరాన్ని పొందిన ప్రతి ఒక్కరికీ కులదైవంగా మారేంతగా స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. నిజానికి ప్రచారం లేకపోయినా... ఇక్కడి స్వామి శక్తికి నిదర్శనంగా నిలిచే ఎన్నో ఘటలున్నాయి. అందులో ఈ వేంకటేశ్వర స్వామిని కోరుకుని, వీసా వరాన్ని పొంది, విదేశాల్లో స్థిరపడ్డ ఎందరో యువతీ యువకుల జీవితాలూ ఇందుకు సాక్ష్యంగా నిలుస్తాయి.
వేంకటేశ సమో దేవా నభూతో న భవిష్యతి అన్నారు పెద్దలు. అంటే వెంటేశ్వరుని వంటి దైవం గతంలో ఎప్పుడూ లేదు. భవిష్యత్తులో కూడా రాబోదు అని. అందుకే ఈ శ్రీనివాసుని నమ్మి చెడిన వారు ఒక్కరంటే ఒక్కరు కూడా లోకంలో లేరు. ఆ వడ్డి కాసుల వాడికి కోరుకుని కోరికలు తీరని వారు లేరు. ఆ ఆపద మొక్కుల వాడిని వేడుకుని కష్టాల నుంచి బయటపడని వారు కూడా లేరు. ఒక్క తిరుమలలోనే కాదు.. ఈ భూమండలం మీద ఎక్కడ వెంకటేశ్వర స్వామి దేవాస్థానం ఉన్నా.. అక్కడ ఇలాంటి మహిమాన్విత శక్తులే ఉంటాయి. అయితే తమ కాలనీకి మాత్రమే దక్కిన ఈ భాగ్యాన్ని.. విశ్వ వ్యాపితం చేసేలా, జనులందరికీ అందేలా సర్థార్ పటేల్ నగర్ కమిటీ సభ్యులు ఆలయాన్ని మరింత విస్తరించి, సర్వాంగ సుందరంగా, వందలాది మంది భక్తులు విచ్చేసినా అందరికీ సౌకర్యవంతమైన దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేశారు. వీటన్నింటితో పాటు సమస్త లోక కళ్యాణార్థం ఇక్కడ నిర్మించిన యజ్ఞశాల... కమిటీ సభ్యుల దైవిక చింతనకు అద్దం పడుతోంది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం స్వామివారి శక్తిని నలుదిశలా ప్రసరింప చేస్తుంది. ఎలమి కోరిన వరాలిచ్చే కమలనాభునికి నిర్మించిన ఈ దివ్య సన్నిధానం... దిన దిన ప్రవర్థమానమవుతోంది. సర్థార్ పటేల్ నగర్ కాలనీ వాసులతో పాటు, చుట్టు పక్కల ఉన్న భగత్ సింగ్ నగర్, వసంతనగర్ తదిరత ప్రాంతాల ప్రజలకూ అందుబాటులో ఉంది. ముఖ్యంగా నేషనల్ హైవే, అందునా నగరంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న సర్థార్ పటేల్ నగర్లో ఉన్న ఈ దేవాలయం భక్తులు యావన్మందికి అత్యంత సమీపాన ఉన్నట్లే లెక్క. ఇలా ఓ ధృఢ సంకల్పంతో మొదలైన ఈ ప్రయత్నం.. ముందు ముందు నిరాటంకంగా సాగాలన్న ధ్యేయంతో కమిటీ సభ్యులు ఎక్కడా వెనుకడుగు వేయకుండా, తమ శక్తి వంచన లేకుండా స్వామి సేవలో తరిస్తూనే ఉన్నారు. రండి. మీరు కూడా శ్రీవారి సేవలో తరించి, అనంతమైన పుణ్యాన్ని సొంతం చేసుకోండి.